

జపాన్ ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచి తన ప్రయాణాన్ని ముగించింది. గత ఆసియా క్రీడల్లోనూ భారత్ నాలుగో స్థానంలోనే నిలిచింది. 2022లో సాధించిన 100 పతకాల మార్క్‌ను ఈసారి అందుకోలేకపోయినా.. గాయాలు, స్టార్ క్రీడాకారుల గైర్హాజరీ, అనూహ్యంగా తప్పుకున్న అథ్లెట్లు, అంచనాలు పెట్టుకున్న కొందరి నిరాశ మధ్య భారత్ మొత్తంగా మెరుగైన ప్రదర్శనే చేసింది. ముఖ్యంగా పెద్దగా అంచనాలు లేని పలువురు క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించారు. కుంకుమ్ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల రికర్వ్ టీమ్ కూడా దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం సాధించింది. రెజ్లర్ సుజీత్ కల్‌కల్ చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకుని స్వర్ణం గెలిచాడు. షూటింగ్‌లో నీరూ దాండా మహిళల ట్రాప్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించడంతో పాటు మొత్తం మూడు పతకాలు సాధించింది. గోల్ఫ్‌లో ప్రణవి శరత్ వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది. అథ్లెటిక్స్‌లో విద్యా రామ్‌రాజ్ మూడు పతకాలు సాధించి ఆకట్టుకుంది.
అయితే మరోవైపు పలువురు స్టార్ క్రీడాకారులు అంచనాలను అందుకోలేకపోయారు. పి.వి. సింధు సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కే పరిమితమైంది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి కనీసం కాంస్య పతకం కూడా సాధించలేకపోయింది. షూటింగ్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ కూడా వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో పతకం లేకుండానే తిరిగొచ్చింది. ఆర్చరీలో జ్యోతి సురేఖపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆమె పతకం సాధించలేకపోయింది. గత రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఈసారి రజతంతో సరిపెట్టుకున్నాడు. గాయాలు కూడా భారత్ పతక అవకాశాలను దెబ్బతీశాయి. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయంతో ఈ క్రీడలకు దూరమయ్యాడు. జ్యోతి యర్రాజి, ప్రవీణ్ చిత్రవేల్, అవినాశ్ సాబ్లే, యశ్‌హాస్ పలాక్ష వంటి పలువురు గాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త తారల మెరుపులు, కీలక పతకాలతో భారత్ ఆసియా క్రీడలను గౌరవప్రదంగా ముగించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!