

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత తన అదృష్టం మారిందని భారత మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇటీవల ఓ సంస్థ నుంచి ‘అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్న సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆయనను కలిసిన తర్వాత మళ్లీ పరుగులు చేయడం ప్రారంభించానని సూర్య చెప్పాడు. తొలుత ఐదు లేదా పది నిమిషాలే ఉంటుందనుకున్న ఆ భేటీ దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిందని, తన కుటుంబంతో కలిసి ప్రధానితో మాట్లాడే అవకాశం లభించిందని వివరించాడు. జీవితంలో మరిచిపోలేని మధురమైన క్షణాల్లో అదొకటని పేర్కొన్నాడు.
మ్యాచ్‌ల సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సూర్య వెల్లడించాడు. క్రికెట్‌లో ఒత్తిడిని తట్టుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుందని, ప్రధానిగా ఎన్నో బాధ్యతలను ఆయన ఎలా నిర్వహిస్తారో తెలుసుకోవాలనుకున్నానని చెప్పాడు. తన ప్రశ్నలన్నింటికీ మోదీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారని తెలిపాడు. గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించిన సారథిగా నిలిచిన సూర్యకుమార్, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా అర్ధశతకాలు సాధిస్తూ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో టీమ్‌ఇండియాలోకి అతడి పునరాగమనంపై అభిమానుల్లో ఆశలు పెరిగాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!