

తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న భారత్‌కు పోటీ గట్టిగానే ఉంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం రేసులో ఉన్న దేశాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో పాటు ఖతార్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, జర్మనీ, హంగేరి, తుర్కియే పోటీలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు భారత్ 2024లోనే ఆతిథ్యం కోసం ప్రతిపాదనలు సమర్పించింది. 2036 గేమ్స్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని భారత్ భావిస్తోంది. ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్ ప్రక్రియకు ఈ నెల 31 వరకు గడువు ఉంది.
పోటీలో ఉన్న దేశాలు వచ్చే నెలలో తమ గేమ్స్ ప్రాజెక్టులను ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే ఏడాది మార్చిలో ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతిపాదనలను పరిశీలించనుంది. 2029 మధ్యలో ఆతిథ్య దేశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఖతార్‌కు గతంలో ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించిన అనుభవం ఉండటంతో భారత్‌కు అక్కడి నుంచి పోటీ ఎదురుకానుంది. జర్మనీ 1972లో, దక్షిణ కొరియా 1988లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. 2028లో లాస్ ఏంజిల్స్, 2032లో బ్రిస్బేన్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!