

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియాకు అవకాశం లభించింది. బ్రిస్బేన్ హీట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, దక్షిణాఫ్రికాకు చెందిన జెస్ జోనాసెన్ తుంటి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. దీంతో ఆమె స్థానంలో యస్తికా భాటియాను బ్రిస్బేన్ హీట్ ఎంపిక చేసింది. గతంలో మెల్బోర్న్ స్టార్స్ తరఫున డబ్ల్యూబీబీఎల్‌లో ఆడిన యస్తికా, బ్రిస్బేన్ హీట్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ఈ సీజన్లో లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా ఆమె నిలవనుంది.
బ్రిస్బేన్ హీట్ రెండో మ్యాచ్ నుంచి యస్తికా జట్టుతో కలిసే అవకాశం ఉంది. సిడ్నీ థండర్‌తో జరిగే మ్యాచ్‌కు ఆమె అందుబాటులోకి రావచ్చని సమాచారం. యస్తికా చేరికపై జట్టు హెడ్ కోచ్ మార్క్ సోరెల్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు ఆస్ట్రేలియా పిచ్‌లపై అనుభవం ఉండటం జట్టుకు ఉపయోగపడుతుందని, జోనాసెన్ లోటును భర్తీ చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత మహిళల టీ20 జట్టు తరఫున ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన యస్తికా భాటియా 374 పరుగులు సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!