

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA 6) గేమ్.. తన గత వెర్షన్లకు భిన్నమైన అనుభూతిని అందించనుంది. సాధారణంగా కార్ ఛేజింగ్‌లు, దోపిడీలు, కాల్పులు, విధ్వంసంతో గుర్తింపు పొందిన ఈ సిరీస్.. తాజా గేమ్‌లో ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చింది. లూసియా కామినోస్, జేసన్ డువాల్ అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ సుమారు 70 గంటల కథ సాగుతుంది. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాను పోలిన కల్పిత ప్రాంతంలో ఈ గేమ్ రూపుదిద్దుకుంది. ఇందులో ఆటగాళ్లు కేవలం నేరాలకు పాల్పడటమే కాకుండా.. చేతులు పట్టుకుని నడవడం, డేటింగ్‌కు వెళ్లడం, కలిసి జిమ్‌కు వెళ్లడం, ఒకరికొకరు సహకరించడం వంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవచ్చు. వీటన్నింటి ద్వారా తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే GTA సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన క్రైమ్ యాక్షన్‌కు కూడా ఇందులో కొదవలేదు. బ్యాంకు దోపిడీలు, కార్ల దొంగతనాలు, పోలీసుల ఛేజింగ్‌లు, ఉత్కంఠభరితమైన మిషన్లు ఆటగాళ్లను ఆకట్టుకుంటాయి. ఈసారి పోలీసుల నిఘా మరింత కఠినంగా ఉండటంతో పాటు వాహనాలు నడిపే సమయంలోనూ వాస్తవిక సవాళ్లు ఎదురవుతాయి. విభిన్నమైన పాత్రలు, ఊహించని సంఘటనలు, ఆసక్తికరమైన సైడ్ మిషన్లతో గేమ్ ప్రపంచాన్ని రాక్‌స్టార్ మరింత సహజంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా లూసియా పాత్ర తన ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అద్భుతమైన గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సన్నివేశాల కంటే లూసియా, జేసన్ మధ్య కనిపించే భావోద్వేగ బంధమే ఈ గేమ్‌కు ప్రధాన బలమని సమీక్ష పేర్కొంది. ప్రేమ, పరస్పర సహకారం, అనుబంధాలకు ప్రాధాన్యమిస్తూ GTA సిరీస్‌లో సరికొత్త అధ్యాయాన్ని రాక్‌స్టార్ పరిచయం చేసినట్లు వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!