

దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా భారతీ ఎయిర్‌టెల్ నిలిచింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాంటార్ విడుదల చేసిన బ్రాండ్జ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితా ప్రారంభమైన తర్వాత ఓ టెలికాం సంస్థ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ ఏడాది వ్యవధిలో 5 శాతం పెరిగి 43.2 బిలియన్ డాలర్లకు చేరింది. 2020 నుంచి ఇప్పటివరకు దాని బ్రాండ్ విలువ 210 శాతం వృద్ధి చెందింది. ఎయిర్‌టెల్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఐపీఓ సన్నాహాల నేపథ్యంలో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ర్యాంకింగ్‌లో చేర్చలేదు.
మరోవైపు, దేశంలోని టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువ గతేడాదితో పోలిస్తే 12 శాతం తగ్గి 460.3 బిలియన్ డాలర్లకు చేరింది. టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లో బ్రాండ్ల విలువ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జనరేటివ్ ఏఐ ప్రభావంతో వ్యాపారపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న టీసీఎస్, ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువలు గణనీయంగా తగ్గాయి. హెచ్‌సీఎల్ టెక్ టాప్-10 జాబితా నుంచి నిష్క్రమించింది. మరోవైపు, ఇ-కామర్స్ సంస్థ మీషో మాత్రం తన బ్రాండ్ విలువను 64 శాతం పెంచుకుని అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా నిలిచింది. నివేదికలో 59వ స్థానాన్ని దక్కించుకున్న మీషో బ్రాండ్ విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!