

అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఎంతోమందికి ఆర్థికంగా మేలు చేసిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. ఈ మేరకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ ఛైర్మన్ బ్రిజేశ్ గొయల్ లేఖ రాశారు. మోదీ ముందుచూపుతో చేసిన విజ్ఞప్తి వల్ల నగల వ్యాపారులు, పెట్టుబడిదారులు భారీ నష్టాల బారిన పడకుండా నివారించగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపార అవసరాల కోసం ముందుగానే పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనే నిర్ణయాలను కూడా ఈ సూచన నిరుత్సాహపరిచిందని తెలిపారు.
ప్రధాని బంగారం కొనుగోళ్లపై హెచ్చరిక చేసిన సమయంలో కిలో ధర సుమారు రూ.1.90 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది దాదాపు రూ.1.25 కోట్లకు తగ్గిందని బ్రిజేశ్ గొయల్ వెల్లడించారు. అంటే కిలోకు సుమారు రూ.65 లక్షల మేర ధర తగ్గిందని పేర్కొన్నారు. అప్పట్లో ప్రధాని సూచనను పట్టించుకోకుండా బంగారం కొనుగోలు చేసినవారు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు, ధరలు తగ్గడంతో పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు కొంత ఊరట లభించిందన్నారు. గతంలో లఖ్నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని మే నెలలో విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. తన సూచన పాటించడం వల్ల డబ్బు ఆదా చేసుకున్నామని పలువురు తనకు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!