

నివాస గృహాలకు సంబంధించి అందుబాటు గృహాల నిర్వచనాన్ని సవరించాలని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ (CREDAI) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రూ.45 లక్షలుగా ఉన్న ధర పరిమితిని రూ.90 లక్షలకు పెంచాలని కోరింది. ఈ మేరకు 2027-28 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం తరఫున పలు సిఫార్సులను కేంద్రానికి సమర్పించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధర పరిమితిని పెంచితే మరిన్ని నివాస గృహాలు అందుబాటు గృహాల కేటగిరీలోకి వస్తాయని, తద్వారా ఈ విభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని క్రెడాయ్ అభిప్రాయపడింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.45 లక్షల వరకు ధర ఉన్న ఇళ్లను అందుబాటు గృహాలుగా గుర్తిస్తున్నారు. సాధారణంగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా, అర్హత కలిగిన అందుబాటు గృహాలపై ఇది ఒక శాతంగా ఉంది. నిర్మాణం పూర్తయిన ఇళ్ల విక్రయాలపై జీఎస్టీ వర్తించదు. 2018లో మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు గృహాల వాటా 54 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 20 శాతానికి పడిపోయిందని క్రెడాయ్ పేర్కొంది. ధర పరిమితి పెంపుతో పాటు కార్పెట్ ఏరియా నిబంధనల్లోనూ ఏకరూపత తీసుకురావాలని సూచించింది. భూమి ధరలు, నిర్మాణ వ్యయం వంటి అంశాలను కూడా నిర్వచనం సవరణలో పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ మార్పులతో అర్హత కలిగిన ఇళ్లపై పన్ను భారం తగ్గి, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుందని క్రెడాయ్ ఆశిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!