

డిసెంబర్ నుంచి బ్యాంకింగ్, పెట్టుబడులు, పెన్షన్లకు సంబంధించి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులపై అదనపు ఛార్జీల భారం పడనుంది. డిసెంబర్ 1 నుంచి రూ.30 వేలకుపైబడిన ప్రతి అర్హమైన రవాణా లావాదేవీపై 1 శాతం ఫీజు విధించనున్నారు. అలాగే ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఇంధన లావాదేవీల మొత్తం రూ.50 వేలు దాటితే, మొత్తం ఇంధన ఖర్చుపై 1 శాతం ఛార్జీతో పాటు వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌లో వస్తువుల ధరల ఒడిదుడుకుల ఆధారంగా కనీస మార్జిన్ నిబంధనలను సెబీ సవరించింది. తక్కువ ఒడిదుడుకులు ఉన్న వస్తువులకు 6 శాతం, మధ్యస్థ స్థాయిలో ఉన్న వాటికి 8 శాతం, అధిక ఒడిదుడుకులు ఉన్న వాటికి 10 శాతం కనీస ఇనీషియల్ మార్జిన్ నిర్ణయించింది. ఈ నిబంధనలు వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులకు డిసెంబర్ 1 నుంచి వర్తిస్తాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరగనుంది. అక్టోబర్ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన ఆర్బీఐ, తాజా సమావేశంలో తీసుకునే నిర్ణయం రుణ వడ్డీ రేట్లపై ప్రభావం చూపనుంది. ఇదిలా ఉండగా, విదేశాల్లో నివసించే అర్హులైన వ్యక్తిగత పెట్టుబడిదారులు డిసెంబర్ 3 నుంచి భారత మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించిన కేవైసీ ప్రక్రియను డిజిటల్ విధానంలో విదేశాల నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు కలగనుంది. మరోవైపు, పెన్షనర్లు నవంబర్ 30లోగా వార్షిక లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. లేకుంటే డిసెంబర్ నుంచి పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆధార్‌లో ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ డిసెంబర్ 31 వరకు ఆధార్ యాప్ ద్వారా ఉచిత సేవను అందిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!