

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా 1,540 మంది జూనియర్ అసోసియేట్స్‌ను నియమించుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఈ నియామకాల ద్వారా ఎంపికైన వారు కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సెప్టెంబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, అక్టోబర్ 29న మెయిన్ పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో రిజర్వ్‌డ్ కేటగిరీల ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.
2027 ఆర్థిక సంవత్సరంలో క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో సుమారు 11,000 నుంచి 12,000 మంది వరకు నియమించుకోవాలని ఎస్‌బీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం బ్యాంకులో 2.47 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం, సంస్థలో సామాజిక ప్రాతినిధ్యం, వైవిధ్యాన్ని పెంపొందించడం తమ లక్ష్యమని ఆయన వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!