

ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈవీ స్టార్టప్ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ భారీ విస్తరణకు సిద్ధమైంది. తమిళనాడులోని హోసూర్ సమీపంలో రూ.779 కోట్ల పెట్టుబడితో కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా శూలగిరిలోని సిప్‌కాట్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ‘బిగ్’ (బిగ్ గ్లోబల్ యాంబిషన్) పేరుతో నిర్మించనున్న ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసింది. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ కొత్త కేంద్రం ద్వారా కంపెనీ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏడాదికి 2.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్తులో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచాలని ప్రణాళిక రూపొందించింది. రాబోయే టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, షాక్‌వేవ్ మోటార్‌సైకిల్‌తో పాటు కొత్త స్పోర్ట్స్, క్రాసోవర్, క్రూయిజర్, స్ట్రీట్ విభాగాల బైక్‌లను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తయారీ కేంద్రానికి అదనంగా హోసూర్ ప్లాంట్ పనిచేయనుంది.
ఈ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-47 వెనమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ బైక్‌ను పరిశీలించారు. కొత్త తయారీ కేంద్రం ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీలో రోబోటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ క్వాలిటీ చెకింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోనూ తమ ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!