

2026 చివరి నెల డిసెంబర్‌లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల సందడి నెలకొననుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన హోండా, జేఎస్‌డబ్ల్యూ మోటార్స్, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో రెండు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUVలు, ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV, ఒక పెట్రోల్ సెడాన్ ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పలు కొత్త మోడళ్లు ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తిని పెంచగా, ఇప్పుడు డిసెంబర్‌లో రానున్న కార్లపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిసెంబర్ 2న హోండా తన తొలి ఎలక్ట్రిక్ కారుగా భావిస్తున్న హోండా ఆల్ఫాను భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. 2025 జపాన్ మొబిలిటీ షోలో హోండా α కాన్సెప్ట్ పేరుతో తొలిసారి ప్రదర్శించిన ఈ SUV ఆధునిక ఏరోడైనమిక్ డిజైన్‌తో ఆకట్టుకోనుంది. ఇందులో రెండు రకాల LFP బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా. ఇక డిసెంబర్ 3న జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన తొలి కారైన JSW కాంబ్యాట్‌ను పరిచయం చేయనుంది. చైనాకు చెందిన జెటూర్ T2 SUV ఆధారంగా రూపొందుతున్న ఈ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తోనే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా.
మరోవైపు, వోక్స్‌వ్యాగన్ తన పాపులర్ సెడాన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను డిసెంబర్ 11న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్‌లో ముందు, వెనుక బంపర్ల డిజైన్‌లో మార్పులతో పాటు LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించనున్నారు. ఇంటీరియర్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. మెరుగైన ఏసీ వ్యవస్థతో పాటు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా అందించవచ్చని సమాచారం. ఇక హ్యుందాయ్ నుంచి రానున్న కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం HE1i అనే కోడ్‌నేమ్‌తో ప్రచారంలో ఉంది. దీనిని ఐయోనిక్ Pగా పేర్కొంటున్నారు. బాక్సీ డిజైన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, కారులో కలిసిపోయినట్లుగా ఉండే డోర్ హ్యాండిల్స్, పిక్సెల్ స్టైల్ లైటింగ్ దీని ప్రత్యేకతలుగా నిలవనున్నాయి.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUVలో 9.9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో రెండు రకాల LFP బ్యాటరీ ఆప్షన్లు అందించనుండగా, పెద్ద బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కారు టాటా నెక్సాన్ EV, కియా సైరోస్ EV, మహీంద్రా XUV 3XO EV వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. మొత్తంగా డిసెంబర్‌లో రానున్న నాలుగు కార్లలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. అయితే ఈ మోడళ్ల ధరలు, పూర్తి ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం, వేరియంట్ల వివరాలను ఆయా కంపెనీలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!