

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కూడా శుక్రవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. పలు గోల్డ్ ఈటీఎఫ్‌లు దాదాపు 6 శాతం మేర పడిపోగా.. సిల్వర్ ఈటీఎఫ్‌లు 9 శాతం వరకు క్షీణించాయి. అమెరికన్ డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు పసిడి, వెండి ధరలపై ఒత్తిడి పెంచాయి. యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ ఈటీఎఫ్, ఛాయిస్ గోల్డ్ ఈటీఎఫ్‌లు దాదాపు 6 శాతం నష్టపోయాయి. ఇతర గోల్డ్ ఈటీఎఫ్‌లు కూడా 5 శాతం వరకు తగ్గాయి. ఎస్‌బీఐ సిల్వర్ ఈటీఎఫ్ ఎన్‌ఎస్‌ఈలో ఒక దశలో 9 శాతం మేర పతనమైంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్‌లు సుమారు 7 శాతం క్షీణించాయి.
ఈ ధరల పతనంతో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే సందిగ్ధంలో మదుపర్లు ఉన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగినవారు సిప్ పద్ధతిలో పెట్టుబడులను కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు తక్కువ మొత్తానికే ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ధరలు పడిపోయాయనే కారణంతో ఒకేసారి భారీగా పెట్టుబడులు పెట్టడం లేదా భయంతో విక్రయించడం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బంగారంతో పోలిస్తే వెండిలో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డాలర్ విలువ, బాండ్ రాబడులు తగ్గితే ఈ లోహాల ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ఫెడ్ సమావేశం అనంతరం మార్కెట్ దిశపై మరింత స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం వరకు బంగారానికి కేటాయించాలని, బంగారం, వెండి రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టేవారు 70:30 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!