

బెంగళూరుకు చెందిన డీప్‌టెక్ స్టార్టప్ ఎథీరియల్ మెషీన్స్ అధునాతన ఫైవ్ యాక్సిస్ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఈ యంత్రం 2 మైక్రాన్ల స్థాయి ఖచ్చితత్వంతో పనిచేయగలదని సంస్థ పేర్కొంది. సాధారణంగా ‘అన్ని యంత్రాలకు తల్లి’గా పిలిచే CNC మెషీన్లు.. ఇతర పారిశ్రామిక యంత్రాలకు అవసరమైన సంక్లిష్ట విడిభాగాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏరోస్పేస్, రక్షణ, సెమీకండక్టర్లు, టర్బైన్లు, పారిశ్రామిక తయారీ వంటి రంగాల్లో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. ఫైవ్ యాక్సిస్ టెక్నాలజీతో ఒకే సెటప్‌లో విడిభాగంలోని వివిధ ఉపరితలాలు, సంక్లిష్ట ఆకృతులను తయారు చేయవచ్చు. అయితే, 2 మైక్రాన్ల ఖచ్చితత్వానికి సంబంధించిన పరీక్షా ప్రమాణాలను సంస్థ బహిరంగంగా వెల్లడించలేదని సమాచారం.
భారత్ అధునాతన మెషీన్ టూల్స్ కోసం ఇప్పటికీ విదేశీ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతోంది. ఇండియన్ మెషీన్ టూల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశ మెషీన్ టూల్ దిగుమతుల విలువ రూ.18,686 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో స్వదేశీగా అధునాతన CNC యంత్రాలను అభివృద్ధి చేయడం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడవచ్చు. ముఖ్యంగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు, నావికాదళ వ్యవస్థలకు అవసరమైన ఖచ్చితమైన విడిభాగాల తయారీలో ఇటువంటి సాంకేతికత వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!