

పండుగల సందర్భంగా ఉద్యోగులకు స్వీట్లు, బహుమతులు, బోనస్లు అందించడం సాధారణం. అయితే, చండీగఢ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిట్స్ గ్రూప్ ఫార్మా సంస్థ ఉద్యోగులకు ఎస్యూవీ కార్లను దీపావళి కానుకగా అందించి వార్తల్లో నిలిచింది. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి సత్కరించేందుకు సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎం.కె. భాటియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల కృషికి గుర్తింపుగా అందించిన ఈ కానుక కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎం.కె. భాటియా తన వ్యాపార ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి సంస్థను విస్తరించినట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం మిట్స్ గ్రూప్ హరియాణాలోని పంచకుల కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, కెనడా, లండన్, దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ వ్యాపారాన్ని విస్తరించినట్లు సమాచారం. ఉద్యోగులకు కార్ల తాళాలు అందజేస్తున్న దృశ్యాలు, కార్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. కష్టపడే ఉద్యోగులకు తగిన గుర్తింపు ఇవ్వడంపై సానుకూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!