

అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్నబ్ తుపాను ప్రభావం, ప్రభుత్వ ముందస్తు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రస్తుత పరిస్థితి, వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు, తుపాను ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ సమీపంలోని యానాం నుంచి సుమారు 167 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గత ఆరు గంటలుగా గంటకు సుమారు 23 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్నట్లు తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సహా అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగులు కూలి రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!