

2006లో హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) హెయిర్ ఆయిల్ మార్కెట్ నుంచి వైదొలుగుతూ తన నిహార్ బ్రాండ్‌ను మారికోకు రూ.240 కోట్లకు విక్రయించింది. అయితే, మూడేళ్ల తర్వాత కేరళకు చెందిన మోసన్స్ సంస్థ ‘ఇండులేఖ’ పేరుతో ప్రీమియం ఆయుర్వేద హెయిర్ ఆయిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. భృంగరాజ్‌తో పాటు ఇతర మూలికలతో తయారు చేసిన ఈ ఉత్పత్తిని అధిక ధరతో విక్రయించింది. అప్పట్లో 100 మి.లీ. పారాచూట్ హెయిర్ ఆయిల్ ధర సుమారు రూ.33 ఉండగా, అదే పరిమాణంలో ఇండులేఖ ధర రూ.432గా ఉండేది. నాణ్యత, ప్రీమియం బ్రాండింగ్‌తో పాటు వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించడంపై సంస్థ దృష్టి పెట్టింది.
2014లో ఇండులేఖ తీసుకొచ్చిన ‘సెల్ఫీ బాటిల్’ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. దువ్వెన ఆకారంలో ఉన్న ఈ అప్లికేటర్‌తో నూనెను నేరుగా తలకు పట్టించుకోవచ్చు. ఈ వినూత్న రూపకల్పనతో మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఇండులేఖ.. 2015 ఆర్థిక సంవత్సరం నాటికి వార్షిక అమ్మకాల్లో రూ.100 కోట్ల స్థాయికి చేరినట్లు కథనాలు పేర్కొన్నాయి. 2016లో HUL ఈ బ్రాండ్‌ను రూ.330 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో రూ.300 కోట్లు ముందస్తు చెల్లింపుగా, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల దేశీయ అమ్మకాల ప్రదర్శనకు అనుసంధానించిన చెల్లింపుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న ఉత్పత్తిని వినియోగదారులకు మరింత సులభంగా, భిన్నంగా అందించడం కూడా వ్యాపారంలో విజయానికి దారితీస్తుందని ఇండులేఖ ప్రయాణం చాటిచెబుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!