

కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో చోటుచేసుకునే తప్పులు ఆర్థిక సంస్థలకు కొత్త తరహా ముప్పులను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వివిధ విభాగాలు, సాంకేతిక వ్యవస్థలు పరస్పరం అనుసంధానమై ఉన్నందున ఒక చోట జరిగే పొరపాటు ఇతర విభాగాలపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందువల్ల ఏఐ వినియోగానికి స్పష్టమైన నియంత్రణలు, పరిమితులు ఉండాలని సూచించారు. ఏఐకి సమాచార ప్రాప్యత, లావాదేవీల అనుమతులు, నిర్ణయాధికారాలపై స్పష్టత ఉండాలని, అవసరమైన చోట మానవ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అనుమతుల నియంత్రణ, లావాదేవీల పరిమితులు, ఆడిట్ తనిఖీలతో ఆర్థిక వ్యవస్థలో ప్రమాదాలను తగ్గించవచ్చని ముంబయిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో వివరించారు.
ఏఐ వల్ల ఉత్పాదకత పెరిగి ఆర్థిక సంస్థలకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, దాని వినియోగంతో కొత్త తరహా పాలనాపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయని శెట్టి పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో ఏఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎప్పుడు మానవ జోక్యం అవసరమవుతుంది అనే అంశాలను బ్యాంకులు ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రుణ చరిత్ర లేని గ్రామీణ రుణగ్రహీతలు, చిన్న వ్యాపారాలు, వ్యక్తులు ఏఐ ఆధారిత వ్యవస్థల వల్ల ఆర్థిక సేవలకు దూరం కాకుండా చూడాలని అన్నారు. వ్యక్తిగత వినియోగం నుంచి సంస్థాగత స్థాయికి ఏఐ విస్తరిస్తున్న నేపథ్యంలో పెద్ద సంస్థలకు పటిష్ఠమైన ఏఐ గవర్నెన్స్ అవసరమని చెప్పారు. బాధ్యతాయుత ఏఐ విధానాన్ని స్వీకరించిన తొలి బ్యాంకు ఎస్‌బీఐ అని ఆయన వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!