

చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్స్ చేరకుండా అడ్డుకునేందుకు అమెరికా అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భారత్ కూడా కీలక భాగస్వామిగా మారింది. అంతర్జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. అత్యాధునిక సెమీకండక్టర్ల సరఫరాపై నియంత్రణ పెంచడంతో పాటు, కీలక సాంకేతిక పరిజ్ఞానం అనధికార మార్గాల్లో చైనాకు చేరకుండా చూడటమే ఈ చర్యల లక్ష్యం. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ను హనీట్రాప్ చేసి భారీ సంఖ్యలో అత్యాధునిక చిప్స్‌ను చైనాకు తరలించారనే ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలో చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో భారత్ ‘శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ ది సెక్యూర్ ఫౌండేషన్ ఆఫ్ ఎండ్యూరింగ్ ప్రాస్పరిటీ’పై సంతకం చేసింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యూకే, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, కీలక సాంకేతిక రంగాల్లో నమ్మకమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే అమెరికా లక్ష్యంలో భాగంగా ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పాక్స్ సిలికా కార్యక్రమంలో భాగమైన భారత్.. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, అత్యాధునిక తయారీ, ఇంధన మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించనుంది. కంప్యూటర్ చిప్స్ రూపకల్పన, తయారీ, సరఫరా వేర్వేరు దేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో మొత్తం సరఫరా గొలుసును భద్రపరచడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్‌కు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం లభించనుంది. భారతీయ కంపెనీలు విశ్వసనీయ సరఫరాదారులుగా ఎదిగేందుకు కూడా ఈ భాగస్వామ్యం దోహదపడనుంది. వచ్చే వారంలో జర్మనీ, ఐరోపా సమాఖ్య, నెదర్లాండ్స్, స్వీడన్ కూడా ఈ డిక్లరేషన్‌లో చేరనున్నట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!