

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 72వ ఎపిసోడ్ పదకొండో వారం నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. ఈసారి మాజీ కంటెస్టెంట్లు డిక్టేటర్లుగా హౌస్‌లోకి వచ్చి సభ్యుల ఆటతీరు, ప్రవర్తన ఆధారంగా నామినేషన్లు చేశారు. షాలినీ, అపూర్వ, దక్షి, ఝాన్సీ, మిథిలేష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. షాలినీ, దక్షి నీతూని నామినేట్ చేయగా.. మిథిలేష్ ముకేష్‌ను, ఝాన్సీ దేబ్జానీని, అపూర్వ వర్షిణిని నామినేట్ చేశారు. మాజీ కంటెస్టెంట్లు లేవనెత్తిన అంశాలు హౌస్‌లో చర్చకు దారితీశాయి. వారు చెప్పిన పాయింట్లకు పలువురు సభ్యులు చప్పట్లు కొట్టడం కనిపించింది.
ముఖ్యంగా షాలినీ, నీతూ మధ్య జరిగిన వాగ్వాదం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. నీతూ ప్రవర్తనను ప్రశ్నించిన షాలినీ.. ఆమె ఏడవడం, భయపడటం, అరవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. నామినేషన్ల విషయంలో నీతూ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది. తన ఆటతీరుపై స్పష్టత లేకుండా రోహిత్‌ను సలహాలు అడగడమేంటని ప్రశ్నించింది. ఇంట్లో అమ్మాయి, అబ్బాయి మధ్య ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరిదీ తప్పు ఉంటే ఒక్కరినే ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీసింది. దీనికి నీతూ గట్టిగానే సమాధానమిచ్చింది. తాను నామినేషన్లకు భయపడనని, వంశీని కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతోనే అతడికి మద్దతు ఇచ్చానని చెప్పింది. బయట ప్రేక్షకులను, ఇంట్లో సభ్యులను గెలుచుకోలేకపోయిన షాలినీ తనను నామినేట్ చేయడం ఏమిటని ఎదురుదాడికి దిగింది.
మాజీ కంటెస్టెంట్లు ఇచ్చిన డ్యాగర్లు తదుపరి నామినేషన్లలో కీలకంగా మారాయి. షాలినీ తన డ్యాగర్‌ను త్రిగుణ్‌కు ఇవ్వగా.. అతడు శివ్‌ను నామినేట్ చేశాడు. గోట్ టాస్క్‌తో పాటు ఇతర ఆటల్లో శివ్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించాడు. తన కోసం త్యాగం చేశానని శివ్ చెప్పడాన్ని తప్పుబట్టాడు. అయితే, ఇమ్యూనిటీ కంటే తన ఓటింగ్ బలం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే గోట్ అవకాశాన్ని వదులుకున్నానని శివ్ వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ త్రిగుణ్.. స్నేహం వేరు, ద్రోహం వేరని వ్యాఖ్యానిస్తూ శివ్ తనను మోసం చేశాడని ఆరోపించాడు. మరోవైపు మిథిలేష్ తన డ్యాగర్‌ను అమన్‌కు ఇవ్వగా.. అతడు సుధీర్‌ను నామినేట్ చేశాడు. తనకు మద్దతు ఇస్తానని చెప్పి చివరకు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నరేష్‌కు మద్దతిచ్చాడని సుధీర్‌పై ఆరోపణలు చేశాడు.
దక్షి కూడా తన డ్యాగర్‌ను త్రిగుణ్‌కే ఇవ్వడంతో అతడు వంశీని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ సమయంలో వంశీ మరీ సాఫ్ట్‌గా వ్యవహరించాడని, కొంతమంది సభ్యులు పనులు తప్పించుకున్నప్పుడు కఠినంగా ఉండాల్సిందని సూచించాడు. అపూర్వ తన డ్యాగర్‌ను శివ్‌కు ఇవ్వగా.. అతడు దేబ్జానీకి కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చినప్పటికీ రామ్ ప్రసాద్ మద్దతు ఇవ్వలేదని ఆరోపిస్తూ అతడిని నామినేట్ చేశాడు. చివరిగా ఝాన్సీ దేబ్జానీని నామినేట్ చేస్తూ అవసరానికి తగ్గట్టుగా వైఖరి మార్చుకుంటున్నావని, ఉమెన్ కార్డ్ ఉపయోగిస్తున్నావని విమర్శించింది. తన డ్యాగర్‌ను ముకేష్‌కు ఇవ్వగా.. అతడు సుధీర్‌ను నామినేట్ చేస్తూ అతడి ఆటతీరును, కృతజ్ఞతాభావాన్ని ప్రశ్నించాడు. దీంతో విసిగిపోయిన సుధీర్.. తప్పు తనదే అయితే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమని వ్యాఖ్యానించాడు.
ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా కనిపించిన అంశం ఏమిటంటే.. మాజీ కంటెస్టెంట్లలో ఒక్కరు కూడా నేరుగా త్రిగుణ్‌ను నామినేట్ చేయలేదు. అతడికి వచ్చిన 13 స్టార్లపై సుధీర్, వర్షిణి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరుసగా నీతూ, అమన్‌తో చర్చించారు. మరోవైపు శివ్‌పై త్రిగుణ్, వంశీ ఇద్దరూ ఒకే తరహా పాయింట్లు చెబుతున్నట్లు అనిపించిందని రామ్ ప్రసాద్, నరేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆరోపణలు, వాదనలు, భావోద్వేగాలతో ఎపిసోడ్ ముగియగా.. తదుపరి ఎపిసోడ్‌లో త్రిగుణ్‌ను ఎవరైనా నామినేట్ చేస్తారా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!