

మీడియా దిగ్గజం రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో జరిగిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. రామోజీరావు పేరుతో అవార్డులు ఏర్పాటు చేసి, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన తొమ్మిది మందిని సత్కరించడం అభినందనీయమన్నారు. 1980 నుంచి రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, విశ్వసనీయత, విలువలకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తి అని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రామోజీరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని, దేశానికి బలమైన నాయకుడు అవసరమని ఆయన తరచూ చెప్పేవారని వెల్లడించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తమ వ్యక్తిగత స్నేహానికి, ప్రభుత్వ వ్యవహారాలకు మధ్య స్పష్టమైన హద్దులు ఉండాలని రామోజీరావు సూచించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
జర్నలిజం, వ్యాపారం, సినిమా, సామాజిక సేవ వంటి రంగాల్లో రామోజీరావు చేసిన కృషిని సీఎం ప్రశంసించారు. వాస్తవాలు, ఆధారాలతో కూడిన వార్తలకు ప్రాధాన్యమివ్వాలని, తనకు సంబంధించిన వార్త అయినా రాయడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని చెప్పిన వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. ఈనాడు పత్రిక విశ్వసనీయత, రామోజీ గ్రూపు సంస్థల్లో కనిపించే క్రమశిక్షణ, నాణ్యత ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెట్టాలని పరిశోధన చేసి సూచించింది కూడా రామోజీరావేనని తెలిపారు. అమరావతి నిర్మాణానికి రామోజీ గ్రూపు రూ.10 కోట్లు, కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాలకు మరో రూ.10 కోట్లు విరాళంగా అందించిందని గుర్తుచేశారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ బాధితులకు అండగా నిలిచిందన్నారు. రామోజీరావు తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి, తరతరాలకు స్ఫూర్తి అని అభివర్ణించిన చంద్రబాబు.. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు రామోజీరావు ఆశయాలు, విలువలను కాపాడుతూ ప్రజాసేవలో వాటిని కొనసాగించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!