

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) NEET PG కన్వీనర్ కోటా (CQ) మొదటి విడత సీట్ల కేటాయింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 16, 2026న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందంటూ అభ్యర్థులకు SMSలు పంపింది. కేటాయించిన కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు నిర్ణీత ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలని సూచించింది. అయితే, అదే రోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో సాంకేతిక కారణాలతో మొదటి విడత అలాట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Withheld) యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రకటించింది. దీంతో కొద్దిసేపటి క్రితం సీట్లు వచ్చాయని సందేశాలు అందుకున్న అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు.
గతంలో పంపిన SMSల ఆధారంగా ఎవరూ కాలేజీల్లో రిపోర్ట్ చేయవద్దని KNRUHS స్పష్టం చేసింది. తదుపరి అధికారిక ప్రకటన వచ్చే వరకు అభ్యర్థులు వేచి ఉండాలని సూచించింది. ఒకవైపు సీట్లు కేటాయించామని సందేశాలు పంపి, మరోవైపు కొన్ని గంటల్లోనే వాటిని నిలిపివేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల రైతు భరోసా పథకం సందేశాల విషయంలోనూ ఇలాంటి గందరగోళం నెలకొందని పలువురు గుర్తుచేస్తున్నారు. కీలకమైన ప్రవేశాల ప్రక్రియలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అభ్యర్థులకు స్పష్టమైన సమాచారం అందించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!