

పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పిస్తూ, వ్యాపార అనుకూల సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ, కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపుపై దృష్టి సారించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి, మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతున్నాయని, వాటిని కంపెనీలు కొత్త నియామకాలు, ఉద్యోగుల వేతనాల పెంపు, వ్యాపార విస్తరణకు ఉపయోగించుకోవాలని సూచించారు. గురువారం జరిగిన ఫిక్కీ వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించామని, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో పాటు ఐటీ రిటర్నులు, రిఫండ్ ప్రక్రియలను సరళీకృతం చేశామని గుర్తుచేశారు. వార్షికాదాయం రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత ఆదాయం మిగులుతోందని చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్త నియామకాలు చేపట్టారా? అని పారిశ్రామికవేత్తలను ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉండకూడదని స్పష్టం చేశారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, సంపద సృష్టికర్తలు, పన్ను చెల్లింపుదారుల పాత్రను గుర్తించి వారిని గౌరవించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి వ్యాపారిని అనుమానంతో చూడటం సరికాదని, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు. అలాగే భారతీయులను కేవలం భారీ వినియోగదారుల మార్కెట్‌గా మాత్రమే చూడకుండా, వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని కంపెనీలకు సూచించారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. APIలు, బల్క్ ఔషధాలు, స్పెషాలిటీ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, ఇంజినీరింగ్ యంత్రాల తయారీలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని సూచించారు. రాబోయే రెండు దశాబ్దాల పెట్టుబడి నిర్ణయాల్లో 'ఇండియా ఫస్ట్' విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేట్ రంగానికి దిశానిర్దేశం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!