

విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న తాటిచెట్లపాలెం-కంచరపాలెం మెట్టు రోడ్డు అధ్వానంగా మారింది. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ నుంచి ఎన్ఏడీ మీదుగా గాజువాక, పెందుర్తి వైపు వెళ్లే వాహనదారులకు ఈ మార్గం అత్యంత కీలకం. ప్రతి ఐదు నిమిషాలకు 250కిపైగా వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి ప్రస్తుతం గుంతలమయంగా మారింది. సుమారు కిలోమీటరు మేర రోడ్డు పూర్తిగా శిథిలమై, తారు లేచిపోయి కంకర రాళ్లు పైకి తేలాయి. కొన్ని చోట్ల అడుగు లోతున గుంతలు ఏర్పడ్డాయి. ఈనాడు ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించగా కిలోమీటరు పరిధిలో ఏకంగా 54 గుంతలు గుర్తించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో పాటు రోడ్డుపై నుంచి లేచే దుమ్ము సమీపంలోని దుకాణాలు, ఇళ్లలోకి చేరుతోంది.
కంచరపాలెంలోని నూకాలమ్మ ఆలయం సమీపంలో ఏర్పడిన భారీ గుంతలు, కర్రల డిపో వద్ద అడుగు లోతున ఉన్న గుంతలు వాహనదారులను భయపెడుతున్నాయి. స్పీడ్ బ్రేకర్ హెచ్చరిక బోర్డు వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వాడపేట రోడ్డు వద్ద డివైడర్ కూడా ధ్వంసమైంది. ఆశీర్వాద కమ్యూనిటీ హాల్ నుంచి ధర్మానగర్ శివాలయం రోడ్డు వరకు సుమారు 200 మీటర్ల మేర కంకర రాళ్లు తేలి రహదారి ఛిద్రమైంది. అంబేడ్కర్ ఆటోస్టాండ్ వద్ద భారీ గుంతలను మట్టితో తాత్కాలికంగా పూడ్చగా, రైల్వే కాలనీ, తాటిచెట్లపాలెం బస్‌స్టాప్ సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు నాగరాజు, తిలక్ రోడ్డు దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయని, పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని చెబుతున్నారు. రాత్రి వేళల్లో భారీ వాహనాల రాకపోకలతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని, అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!