

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు అచ్యుతదేవరాయల కాలం నాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. సుమారు 495 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శాసనాన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు ఇటీవల అచ్చు తీశారు. ఆలయంలోని మూడో ప్రాకారం గోడపై ఈ శాసనం ఉన్నట్లు ఏఎస్‌ఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి వెల్లడించారు. ఈ శాసనం తమిళ భాషలో ఉండగా, క్రీ.శ. 1531 ఫిబ్రవరి 13వ తేదీకి చెందినదిగా గుర్తించారు.
శక సంవత్సరం 1462, శార్వరి నామ సంవత్సరం, కుంభ మాసం, బహుళ తదియ, ఆదివారం నాటి వివరాలు ఇందులో పొందుపరిచారు. తిరుమలలో నివసించే ఏకాంగి శ్రీవైష్ణవుల్లో ఒకరైన పేరరుళాళయ్యన్ చేసిన దానధర్మానికి సంబంధించిన వివరాలను ఈ శాసనం తెలియజేస్తోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల ఆలయంలో కొనసాగిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, దానధర్మాలు, అప్పటి చారిత్రక పరిస్థితులపై ఈ అరుదైన శాసనం విలువైన సమాచారాన్ని అందించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!