

భారత్‌లో వివిధ దేవతలకు ఆలయాలు ఉండటం సాధారణమే. అయితే మహాభారతంలో కౌరవుల పెద్దవాడైన దుర్యోధనుడికి ఆలయం ఉండటం మాత్రం ఆసక్తిని కలిగిస్తుంది. కేరళంలోని పారువళి ప్రాంతంలో ఉన్న మలనాడ ఆలయం దుర్యోధనుడితో అనుబంధం ఉన్న ప్రత్యేక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక స్థలపురాణం ప్రకారం.. పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో వారిని వెతుకుతూ దుర్యోధనుడు ఈ కొండ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతారు. ఆకలి, దాహంతో అలసిపోయిన ఆయనకు స్థానికంగా నివసించే ఓ వృద్ధురాలు ఆతిథ్యం ఇచ్చి కల్లు అందించిందని కథనం. ఆమె ఆతిథ్యానికి, భక్తికి మెచ్చిన దుర్యోధనుడు గ్రామస్థుల సంక్షేమం కోసం ప్రార్థించాడని, వారికి విస్తారమైన భూములను దానం చేశాడని స్థానిక నమ్మకం. అనంతరం ఆయన పట్ల కృతజ్ఞతతో గ్రామస్థులు దుర్యోధనుడిని కొలవడం ప్రారంభించారని స్థలపురాణం చెబుతోంది.
మలనాడ ఆలయం ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడి విగ్రహం ఉండదు. అలాగే సంప్రదాయ ఆలయాలకు కనిపించే ఎత్తైన గోపురం కూడా ఉండదు. ఆలయ ప్రాంగణంలోని ఎత్తైన వేదికను ‘అలతార’ అని పిలుస్తారు. భక్తులు ఈ ప్రదేశంలోనే నిలబడి దుర్యోధనుడిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తారు. ఆలయానికి సంబంధించిన భూములకు దుర్యోధనుడి పేరుతో పన్నులు చెల్లించే సంప్రదాయం కూడా ఉందని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. అయితే దుర్యోధనుడి ఆలయానికి సంబంధించిన ఈ వివరాలు ప్రధానంగా స్థానిక స్థలపురాణాలు, మౌఖిక సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి. వీటన్నింటినీ నిర్ధారించే చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేవు. అయినప్పటికీ కేరళంలోని వైవిధ్యభరితమైన మత, సాంస్కృతిక సంప్రదాయాలకు ఈ ఆలయం ఒక ఆసక్తికర ఉదాహరణగా నిలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!