

భారత్ ప్రతిష్ఠాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే అభివృద్ధి చేస్తున్న తొలి హైస్పీడ్ రైలుకు 2027 మే లేదా జూన్‌లో ట్రయల్ రన్స్ ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లోని ఒక మార్గంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌లో నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తైన తర్వాత రెండు నుంచి నాలుగు నెలల్లో ప్రయాణికుల కోసం సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చని మంత్రి తెలిపారు.
వడోదరలో నిర్వహించిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. దేశీయంగా తయారవుతున్న హైస్పీడ్ రైలు తొలి బాడీ ఫ్రేమ్ సిద్ధమైందని, దాని నిర్మాణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు స్క్వీజ్ టెస్టింగ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ అభివృద్ధితో భారత్ హైస్పీడ్ రైలు సేవల దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లైంది. అవసరమైన పరీక్షలు, ఇతర ప్రక్రియలు పూర్తైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గం దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సర్వీస్ కారిడార్‌గా నిలవనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!