

రహదారులపై నిలిపి ఉంచిన లేదా పార్క్ చేసిన వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాంటి వాహనాలను వెంటనే గుర్తించి తొలగించేలా రహదారులపై ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ని ప్రశ్నించింది. గత ఏడాది నవంబరులో రాజస్థాన్‌లోని ఓ రహదారిపై జరిగిన ప్రమాదంలో 15 మంది మృతి చెందిన ఘటనపై సుమోటోగా చేపట్టిన కేసు విచారణ మంగళవారం కొనసాగింది. ఎన్‌హెచ్‌ఏఐకి అవసరమైన అన్ని వనరులు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ నిఘా పరికరాల ఏర్పాటులో ఎందుకు జాప్యం జరుగుతోందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఏ.జి. మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఇలాంటి ప్రమాదాలు ఇటీవల కూడా అనేకం చోటుచేసుకున్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది ఏ.ఎన్.ఎస్. నాదకర్ణి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రహదారులపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!