

దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో హీరో విక్టరీ వెంకటేష్ జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దేశానికి యువతే అతిపెద్ద సంపద అని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు చేపట్టిన ఈ ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇంత మంచి సంకల్పంతో ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నషా ముక్త్ భారత్ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం ఎంతో విలువైనదని, యువత డ్రగ్స్ వైపు కాకుండా తమ లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులపై కూడా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములై యువతకు సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, యువతను వాటికి దూరంగా ఉంచేందుకు సమాజమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే సంకల్పంతో అందరం ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారతదేశ యువత ఎంతో శక్తిమంతమైనదని, వారిని నిర్వీర్యం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో కొందరు యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలను తయారు చేసే వారితో పాటు వాటిని సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ప్రధాని మోదీ నషా ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చారని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ భవిష్యత్తును కాపాడాలని కోరారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు తాను మూడు రోజుల పాటు పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు కోసం ఈ డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వచ్చిన హీరో వెంకటేష్‌కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!