

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, సమాజం కోసం వారు చేసిన పోరాటం ‘ఫూలే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఈ సినిమాలో జ్యోతిరావ్ ఫూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి ఫూలే పాత్రలో పత్రలేఖ నటించారు. సుపదా క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాతగా డా. పొన్నం రవిచంద్ర వ్యవహరించగా, తెలుగు సంభాషణలను చేతన్ కత్తి అందించారు.

కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు సాగించిన పోరాటంతో పాటు మహిళా విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని ఈ సినిమా ప్రధానంగా చూపించనుంది. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సామాజిక కార్యకర్త విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, రచయిత పసునూరి రవీందర్ పాల్గొని చిత్రానికి తమ మద్దతు తెలిపారు. మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే వేసిన పునాదులు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను ముఖ్యంగా యువత, మహిళలకు పరిచయం చేసే ప్రయత్నమని నిర్మాత డా. పొన్నం రవిచంద్ర తెలిపారు. నవంబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా, ఇందులో ప్రతీక్ గాంధీ పాల్గొననున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!