

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దిగుమతి సుంకాలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. భారత్, చైనా సహా పలు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు పెంచే అంశాన్ని ఆయన ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఈ వారంలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయనే ఆరోపణలు ఈ ప్రతిపాదనకు కారణంగా తెలుస్తోంది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ మార్చి 11న ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా 16 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తున్నారు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం ఈ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల వల్ల కొన్ని దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి అవసరానికి మించి పెరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో ఆయా దేశాల కంపెనీలు తక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తూ అమెరికా తయారీ రంగానికి పోటీగా నిలుస్తున్నాయని పేర్కొంటోంది. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాలపై 15 శాతం లేదా అంతకంటే తక్కువ టారిఫ్‌లు విధించే అవకాశం ఉండగా, భారత్, వియత్నాంపై అంతకంటే ఎక్కువ సుంకాలు ఉండవచ్చని అంచనా. చైనాపై మరింత అధిక టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని కథనం పేర్కొంది. అయితే భారత్‌పై విధించబోయే సుంకాల శాతంపై ఇంకా స్పష్టత లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!