

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అమరవీరుల విషయంలో గతంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని ప్రకటించింది బీజేపీనేనని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసి విజయం సాధించిందని పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో నిర్వహించనున్న ‘ఓట్ చోర్ గద్దీ చోర్’ నిరసన కార్యక్రమంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణనను కూడా చేపట్టాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అమిత్ షాకు లేఖ రాయనున్నట్లు, తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరనున్నట్లు చెప్పారు. ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ కూడా బీసీ కులగణనపై తమ వైఖరిని వెల్లడించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కేంద్ర హోంమంత్రి నిరసన కార్యక్రమాలు చేపట్టడం విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఓటు చోరీ ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపుర్‌లో మహిళలపై దాడులు, అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఆక్రమణల ఆరోపణలు వంటి అంశాలపై కేంద్ర హోంమంత్రి దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో దీపావళి వ్యాపారాలు జరిగే సమయంలో భారీ ర్యాలీ నిర్వహించడం వల్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగవచ్చని, ర్యాలీ విషయంలో ఆర్భాటం తగ్గించాలని అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!