

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వరుస తుఫానులు, భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యా సంవత్సరంలో పాఠశాలలు పనిచేయాల్సిన రోజులు తగ్గిపోయాయి. కోల్పోయిన పనిదినాలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు పలు జిల్లాల్లో రెండో శనివారం సెలవులను రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలో తుఫాన్, భారీ వర్షాల ప్రభావం ఎదుర్కొన్న శ్రీకాకుళం జిల్లాలోనూ రెండో శనివారం సెలవులను రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో గతంలో సెప్టెంబర్ 23, 24, అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వీటికి బదులుగా నవంబర్ 14, డిసెంబర్ 12, ఫిబ్రవరి 13, మార్చి 13 తేదీల్లో రెండో శనివారాలు పాఠశాలలు పనిచేయాలని అధికారులు ఆదేశించారు. జనవరి రెండో శనివారం సంక్రాంతి సెలవుల్లోకి రావడంతో దానికి మినహాయింపు ఇచ్చారు. పరిహారంగా పనిచేయాల్సిన ఐదో రోజును ఏప్రిల్‌లో ఖరారు చేయనున్నారు. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!