

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఎక్కువ భాగం ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పోలింగ్ అనంతరం విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చినప్పటికీ, వాటిపై ఆధారాలను పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించామని, 12 జిల్లాల కలెక్టర్లతో సుమారు 45 నిమిషాల పాటు పోలింగ్ సరళి, ఫిర్యాదులు, హింసాత్మక ఘటనలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు ప్రిసైడింగ్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు సమర్పించే నివేదికలు, ఆధారాలను పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సంఘం తటస్థంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ఘటనలు జరిగినట్లు కలెక్టర్లు నివేదించారని పునేఠా వెల్లడించారు. సుమారు 40 ఘటనలకు సంబంధించి 275 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజకుమారి తెలిపారని, నేర స్వభావం ఉన్న కేసుల్లో కొందరిని అరెస్టు చేసినట్లు వివరించారు. విజయవాడ నగరంలోని 55వ వార్డులో సాంకేతిక, ఇతర కారణాలతో పోలింగ్ రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సమయాన్ని పొడిగించినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నాటికి ప్రాథమిక ఓటింగ్ శాతం 48.03గా నమోదైందని, అయితే బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని స్వీకరించి ప్రతి కేంద్రంలోని ఓట్లను ధ్రువీకరించిన తర్వాతే తుది శాతాన్ని ప్రకటిస్తామని తెలిపారు. తుది పోలింగ్ శాతాన్ని సోమవారం వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!