

అస్సాంలోని జోర్హాట్లో ఆర్మీ వాహన తనిఖీ వివాదానికి దారితీసింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆర్మీ సిబ్బందితో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సమీమ్ సుల్తానా అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆమెను విధులకు దూరం చేసింది. ఈ ఘటనపై జోర్హాట్ జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ధనంజయ్ సైకియా వివరణ ఇచ్చారు. నవంబర్ 18న జోర్హాట్ ఐఎస్బీటీ సమీపంలో రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిచుబారి మిలిటరీ స్టేషన్‌కు చెందిన ఆర్మీ జిప్సీని నిలిపి, అందులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో సైనిక సిబ్బందిని డ్రైవింగ్ లైసెన్స్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్మీ సిబ్బంది పట్ల ఎంవీఐ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వివాదంపై డీటీఓ ధనంజయ్ సైకియా మాట్లాడుతూ.. ఆర్మీ డ్రైవర్ వద్ద సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదనే కారణంతో చలాన్ విధించలేదని, సీట్ బెల్ట్ ధరించనందుకే జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. రక్షణ శాఖ అధికారిక మిలిటరీ వాహనాలను నడిపేందుకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయని తెలిపారు. మోటార్ వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 18 ప్రకారం రక్షణ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌లకు దేశమంతటా గుర్తింపు ఉంటుంది. అందువల్ల అధికారిక ఆర్మీ వాహనాలను నడిపేందుకు ప్రత్యేకంగా సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అయితే ఈ మినహాయింపు అధికారిక మిలిటరీ వాహనాలకే పరిమితం. ప్రైవేట్ కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలను నడపడానికి సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అలాగే రక్షణ శాఖ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపు లేదని డీటీఓ వివరించారు. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 194B ప్రకారం సీట్ బెల్ట్ ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించవచ్చని, ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందని చెప్పారు.
తనిఖీ సమయంలో ఎంవీఐ సమీమ్ సుల్తానా ప్రవర్తన సరిగా లేదని, ఆమె చేసిన వ్యాఖ్యలు అనవసర గందరగోళానికి కారణమయ్యాయని డీటీఓ అంగీకరించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించామని, పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఆమెను విధులకు దూరంగా ఉంచినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, కాజీరంగా సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా జోర్హాట్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్కరోజే 189 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి, 16 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఆర్మీకి, జిల్లా యంత్రాంగానికి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్న డీటీఓ, ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!