

ఢిల్లీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న పోరాటంపై తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓటు చోరీ ఆరోపణలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడం, జంతర్ మంతర్‌కు వెళ్లే వారి బస్సులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. బారికేడ్లు, కేసులు, అరెస్టులతో ప్రజల ప్రశ్నలను అణచివేయలేరని, రాహుల్ గాంధీ పోరాటాన్ని కేసులతో నిలువరించాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ భ్రమేనని అన్నారు.
ఓటర్ల జాబితాల సవరణపై వస్తున్న అభ్యంతరాలకు ఎన్నికల సంఘం ఆధారాలతో సమాధానం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులకు అనుసరించిన ప్రమాణాలను బహిర్గతం చేయాలని, ఓటు చోరీ ఆరోపణలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరగాలని కోరారు. ఏ పార్టీ ఒత్తిడికీ లోనుకాకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని అన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!