

బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుకలు పట్నా జిల్లాలోని ఆయన స్వగ్రామం లడ్మాలో ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 25న జరగనున్న ఈ వివాహానికి కమాండెంట్ రణవిజయ్ కుమార్ కుమారుడు రిషికేశ్ కుమార్ వరుడిగా నిలవనున్నాడు. ఇప్పటికే పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ కార్యక్రమం ప్రారంభమైంది. అతిథుల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత్ సింగ్ సన్నిహితుడు కన్హయ్య సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అతిథుల కోసం ఏకంగా 50 లక్షల గులాబ్ జామూన్లు తయారు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 100 అడుగుల పొడవైన భారీ వంటశాలను ఏర్పాటు చేశారు. మిఠాయిల తయారీ కోసం 10 వేల కిలోల పాల ట్యాంకర్లను నేరుగా వంటశాల వద్దకు తీసుకొచ్చారు. వంటకాల తయారీకి మరో 12 టెంట్లను కూడా సిద్ధం చేశారు.
ఈ వివాహ వేడుకల్లో గుర్రపు పందేలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మేలుజాతి గుర్రాలను ఇప్పటికే లడ్మాకు తీసుకొచ్చారు. పందెంలో విజేతగా నిలిచిన వారికి థార్ కారును బహుమతిగా ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మైదానం బురదమయంగా మారడంతో పందేల నిర్వహణ కోసం గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు. అతిథుల రాకపోకల కోసం హైవే పక్కనే ప్రత్యేక హెలిప్యాడ్‌ను నిర్మించారు. ఈ వేడుకలపై అనంత్ సింగ్ మాట్లాడుతూ.. తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఆయన కుమారులు అంకిత్, అభిషేక్, అభినవ్ అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ భాజపా ఎమ్మెల్యే సుశీల్ సింగ్ ఇప్పటికే వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంత్ సింగ్ తనకు సోదరుడి లాంటి వారని, రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయనను ఆహ్వానిస్తామని చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!