

అమెరికా 2026 మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక రాజకీయ పరీక్షగా మారాయి. కాంగ్రెస్‌పై ఆధిపత్యం కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్లు హోరాహోరీగా తలపడుతున్న వేళ.. ఎన్నికల ప్రచార ఖర్చు కూడా రికార్డు స్థాయికి చేరింది. ‘ఓపెన్‌సీక్రెట్స్’ అంచనా ప్రకారం ఈ ఎన్నికల కోసం మొత్తం వ్యయం దాదాపు 12 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది 2022 మధ్యంతర ఎన్నికలతో పోలిస్తే సుమారు 30 శాతం అధికం. అక్టోబర్ మధ్య నాటికే 9.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు ఎన్నికల ఆర్థిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇరు పార్టీలకు మద్దతుగా సంపన్నులు, రాజకీయ కార్యాచరణ కమిటీలు భారీగా నిధులు సమకూరుస్తుండటంతో ప్రచార ఖర్చు అనూహ్యంగా పెరిగింది.
ఈ ఎన్నికల చక్రంలో అత్యధిక విరాళాలు అందించిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలిచారు. రిపబ్లికన్లకు మద్దతుగా ఆయన ఫెడరల్ రాజకీయ కమిటీలకు సుమారు 445 మిలియన్ డాలర్లు అందించారు. జెఫ్ యాస్ సహా పలువురు సంపన్నులు కూడా రిపబ్లికన్ అనుకూల సంస్థలకు విరాళాలు ఇచ్చారు. మరోవైపు, జార్జి సోరస్‌కు చెందిన సంస్థలు డెమోక్రటిక్ అనుకూల గ్రూపులకు సుమారు 102 మిలియన్ డాలర్లు సమకూర్చాయి. న్యూయార్క్ మాజీ మేయర్ మైఖెల్ బ్లూమ్‌బర్గ్ కూడా 60 మిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చారు. క్రిప్టోకరెన్సీ సంస్థలు సైతం రాజకీయ గ్రూపులకు భారీగా నిధులు అందించాయి. ఇక 2025–26 ఎన్నికల చక్రంలో రాజకీయ ప్రకటనల ఖర్చు 11 బిలియన్ డాలర్లను దాటినట్లు యాడ్ ఇంపాక్ట్ అంచనా వేసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!