

రాబోయే రామాయణం సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం ఉందా? లాస్ ఏంజెల్స్‌లో జరిగిన సినిమా ప్రీమియర్ సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై ఆసక్తిని పెంచాయి. అంతర్జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆయన, తొలుత ఈ ఇతిహాస కథను మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించామని, ఆ తర్వాత రెండు భాగాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, సినిమాలకు మంచి ఆదరణ లభిస్తే కథను మరింత విస్తరించే విషయాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు.
మూడో భాగం వస్తే కథ లవకుశుల చుట్టూ తిరుగుతుందా? లేక రామాయణంలోని మరో కోణాన్ని చూపిస్తారా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ కార్యక్రమంలోనూ రామాయణంలోని కొన్ని పాత్రల ఆధారంగా ప్రత్యేక స్పిన్‌ఆఫ్ చిత్రాలను రూపొందించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ విజువల్ చిత్రం ఒక్కో భాగానికి సుమారు రూ.2,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు సమాచారం. ప్రముఖ సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మూడో భాగంపై తుది నిర్ణయం ప్రేక్షకుల స్పందన, చిత్ర బృందం భవిష్యత్ ప్రణాళికలపై ఆధారపడి ఉండనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!