

క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఖరీదైన క్యాన్సర్ మందుల ధరలను గణనీయంగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నవంబర్ 9న ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 137 రకాల క్యాన్సర్ నిరోధక మందులపై వాణిజ్య మార్జిన్లకు పరిమితి విధించింది. అక్టోబర్ 17న తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా సవరించిన గరిష్ఠ చిల్లర ధరలు (ఎంఆర్‌పీ) నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఫార్మాస్యూటికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 8 నాటికి 85 ఫార్మా కంపెనీలు 121 రకాల ఔషధాలకు చెందిన 1,364 క్యాన్సర్ నిరోధక ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించాయి. వీటిలో 679 బ్రాండ్ల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. అత్యధికంగా ఒక బ్రాండ్ ఔషధం ధరపై 96.45 శాతం వరకు కోత విధించారు. ఈ నిర్ణయం ద్వారా రోగులకు ఏటా సుమారు రూ.3,540.38 కోట్ల మేర ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కొత్తగా నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు మందులు విక్రయించడానికి మెడికల్ షాపులు, ఆస్పత్రుల ఫార్మసీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. వినియోగదారులు ఫార్మా సహీదామ్ యాప్ లేదా ఎన్‌పీపీఏ వెబ్‌సైట్‌లో ధరలను తనిఖీ చేసుకోవచ్చు. అధిక ధరలకు మందులు విక్రయిస్తే ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్ ద్వారా లేదా 1800-111-255 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!