

టిబెట్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా కార్యాలయానికి దిల్లీలోని ప్రతిష్ఠాత్మక లుటియన్స్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం బంగ్లాను కేటాయించినట్లు సమాచారం. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లో ఉన్న ఈ నివాసాన్ని దలైలామా కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూసే ‘గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’కు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి ప్రభుత్వ నివాసాలను మూడేళ్ల కాలానికి కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆ గడువును పొడిగించే అవకాశం ఉంటుంది. దలైలామా సంస్థను పరిరక్షించడం, ఆయన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సహకరించడంతో పాటు మానవతా విలువలు, మత సామరస్యం, టిబెట్ సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని ప్రోత్సహించడం ఈ ట్రస్ట్ ప్రధాన లక్ష్యాలు.
మరోవైపు, దలైలామా తదుపరి వారసుడి ఎంపిక ప్రక్రియపై అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌తోనే సంప్రదింపులు జరపాలని అమెరికాకు చెందిన ఓ కమిషన్ సూచించినట్లు సమాచారం. వారసుడి ఎంపికలో చైనా జోక్యం చేసుకోకుండా చూడాలని, తదుపరి దలైలామాను గుర్తించే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కే ఉండాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చైనా తనకు అనుకూలమైన వ్యక్తిని తదుపరి దలైలామాగా ప్రకటించే అవకాశం ఉందన్న ఆందోళనలను కూడా ఆ కమిషన్ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దలైలామా కార్యాలయానికి దిల్లీలోని కీలక ప్రాంతంలో కేంద్రం బంగ్లా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!