

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. నాటి భూస్వామ్య వ్యవస్థను ఎదురించి, చట్టాల పరిధిలో న్యాయపోరాటం చేసి విజయం సాధించిన ఆమె ధైర్యం, ప్రజా ఆకాంక్షల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని కేసీఆర్ అన్నారు. ఆమె గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించిందని తెలిపారు.
రాష్ట్ర రైతాంగం, సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగించడం ద్వారా ఐలమ్మకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాటాన్ని, తెలంగాణ సమాజంపై ఆమె చూపిన ప్రభావాన్ని నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!