

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐఐటీయన్ల మేధస్సు, నైపుణ్యాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంతో పాటు దేశాభివృద్ధికి ఐఐటీయన్లు బలమైన నెట్‌వర్క్‌గా ఏర్పడి రాష్ట్రంతో అనుసంధానం కావాలని సూచించారు. అక్టోబర్ 3న విజయవాడలో నిర్వహించిన పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026లో పాల్గొన్న సీఎం.. ఏపీని డీప్‌టెక్, ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అమరావతిలో పాన్‌ఐఐటీ అమరావతి కౌన్సిల్ ఏర్పాటు చేయడంతో పాటు డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు రూ.500 కోట్ల పాన్‌ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సదస్సులో క్యూబిట్ ఫోర్స్ రూపొందించిన ఐదు క్యూ-శివ క్వాంటం కంప్యూటర్లను, 4 కెల్విన్ ప్రాసెసర్‌ను ఆయన ఆవిష్కరించారు. అమరావతిలో క్వాంటం టెక్నాలజీకి అవసరమైన మౌలిక వసతులు, పరిశోధన, నైపుణ్యాలు, తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు జరిగిన పాన్‌ఐఐటీ సదస్సులో ఐఐటీలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారుల ప్రతినిధులు పాల్గొన్నారు. డీప్‌టెక్, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ, ఆరోగ్య సంరక్షణ, అగ్రిటెక్, నీటి భద్రత, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక ఆధారిత పాలన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఐఐటీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కోసం పాన్‌ఐఐటీ సదస్సును ప్రతి ఏడాది నిర్వహించాలని చంద్రబాబు ప్రతిపాదించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!