

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు జిల్లాలో మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనుండగా, రూ.92.98 కోట్ల విలువైన పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. దుబ్బాక, సిద్దిపేటలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లాలో ఆరు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేయనున్నారు.
మరోవైపు జిల్లాలో నిర్మించిన 14 విద్యుత్ సబ్‌స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి సత్రంతో పాటు క్యూ కాంప్లెక్స్‌ను కూడా ప్రారంభించనున్నారు. విద్య, విద్యుత్, పరిపాలన, ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలతో సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటన ద్వారా జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!