

రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు, పద్మవిభూషణ్ రామోజీరావు 90వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు సోషల్ మీడియా వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు పత్రికా రంగానికి కొత్త దిశ చూపడంతో పాటు టెలివిజన్, సినీ రంగాల్లోనూ చెరగని ముద్ర వేసిన దార్శనికుడిగా చంద్రబాబు కొనియాడారు. రాజీలేని వ్యక్తిత్వం, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీతో ఎన్నో సంస్థలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు.
స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు ఎదిగి తెలుగు మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. చివరి శ్వాస వరకు ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేశారని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నిష్పక్షపాత జర్నలిజానికి ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు వ్యాపారాల్లోనూ విలువలు, నైతికతకు ప్రాధాన్యమిచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అన్నదాత పత్రిక ద్వారా రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. సామాన్యుడు తలచుకుంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలడని నిరూపించిన దార్శనికుడిగా రామోజీరావును మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివర్ణించారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన స్థానం శాశ్వతమని నేతలు పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!