

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వేగం పెరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పనులు కొనసాగించాలని, స్పష్టమైన వర్క్ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను సమీక్షించాలని, ప్రతి పనికి ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. ఆస్పత్రి నిర్మాణాన్ని నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఇటీవల ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్తు కూడా అధికారులను ఆదేశించారు.
వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, రహదారి అనుసంధానం వంటి అంశాలపైనా సీఎం సమీక్షించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లను అనుసంధానించే రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయాలని, విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేసేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని, ఆలయ, అటవీ పర్యాటకంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి దేవాలయం, రామప్ప దేవాలయాలకు భవిష్యత్తులో పెరిగే భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించాలని, అన్ని వసతులతో కూడిన పెద్ద బస్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!