

ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుఫాన్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు మరోసారి జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ రాత్రి 1 గంటకు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకిందని, ఉదయం 6:30 గంటలకు పూర్తిగా తీరం దాటుతుందని అధికారులు సీఎంకు వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై కూడా ఆరా తీశారు. ఇప్పటివరకు ఎక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోలేదని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత వరకు నివారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సీఎంకు వివరించారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉందని కలెక్టర్ తెలిపారు. రెండు చోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఏడు చోట్ల చెట్లు కూలిపోగా, వాటిని తొలగించామని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఐదు ప్రాంతాల్లో చెట్లు పడిపోయినట్లు సమాచారం అందగానే చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజాబాబు వివరించారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైనప్పటికీ, విద్యుత్ స్తంభాలు లేదా చెట్లు కూలిన ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయని, బుడమేరు ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందనే ముందస్తు జాగ్రత్తతో కొన్ని కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించినట్లు చెప్పారు.
మరోవైపు, తుఫాన్ సహాయక చర్యలు కొనసాగిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు సోమవారం రాత్రి 10 గంటలకే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి పరిస్థితిపై సమాచారం తీసుకుంటూనే ఉన్నారు. సోమవారం రోజంతా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)లో ఉండి తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేస్తూ సోమవారం మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!