

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో గోపిక అనే విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌ను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిందితుడికి మద్దతుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయించేందుకు జగన్ తన అనుచరులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన సాల్మన్ రాజు, మంగళగిరికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు గుండా గోపీకృష్ణ ఈ పిటిషన్ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు.
ఒకవైపు తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని పరామర్శిస్తూ సానుభూతి వ్యక్తం చేస్తూనే, మరోవైపు దాడి నిందితుడిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మాధవి ఆరోపించారు. పోలీసుల కాల్పులు అనవసరమని, నిందితుడిని కుక్కలా ఈడ్చుకెళ్లారని కోర్టులో వాదించడం దారుణమని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జగన్, తన తరఫున కనీసం ఒక్క రూపాయి కూడా ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. మహిళల పట్ల జగన్ వైఖరి ఇదేనని, రాష్ట్రంలోని మహిళలు ఆయనను ఎప్పటికీ క్షమించరని గళ్లా మాధవి వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!