

తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడుల విస్తరణకు అవసరమైన విధానపరమైన మార్పులు, ఇతర సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామితో పాటు పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు ఉన్న చారిత్రక వ్యాపార నేపథ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అంతర్జాతీయ గుర్తింపును సీఎం ప్రస్తావిస్తూ, తెలంగాణలో పెట్టుబడులను విస్తరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను ఐదు శాతం నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకమని పేర్కొంటూ, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లు, విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలను ప్రస్తావించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని అన్నారు. హైదరాబాద్ పోటీ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో మాత్రమే కాకుండా న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాలతో ఉండాలని ఆకాంక్షించారు. పెట్టుబడుల మార్గంలోని అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇస్తూ, పారిశ్రామికవేత్తలు తమ సూచనలు అందించాలని కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో పాల్గొనాలని ఆహ్వానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!