

నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల పురోగతిపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి, తదుపరి దశలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు. గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణం 23 శాతం పూర్తయిందని, నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో భవన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.
ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!